Take a fresh look at your lifestyle.

ఇరాన్-అమెరికా యుద్ధం ఎఫెక్ట్… లీటర్ డీజిల్‌పై రూ.35 నష్టపోతున్న కంపెనీలు

0 26

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు భారీగా పెరిగాయి. అయితే మన వద్ద పెట్రోల్, డీజిల్ ధరలు యథాతథంగా కొనసాగుతుండటంతో చమురురంగ కంపెనీలు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. చమురు కంపెనీలకు లీటర్ పెట్రోల్‌పై రూ.18, లీటర్ డీజిల్‌పై రూ.35 చొప్పున నష్టం వస్తోంది.

రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా బ్యారెల్ చమురు ధర 100 డాలర్లు దాటింది. ఇప్పుడు ఇరాన్, అమెరికా యుద్ధ ప్రభావంతో ఒక దశలో బ్యారెల్ చమురు 120 డాలర్లకు చేరుకుంది. చమురు ధరలు భారీగా పెరిగినప్పటికీ మన వద్ద ధరలు పెరగకపోవడంతో చమురురంగ కంపెనీలు నష్టాలను చూస్తున్నాయి. ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ సంస్థలు రోజుకు రూ.2,400 కోట్ల మేర నష్టాలను భరించాల్సి వస్తోంది.

అయితే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడం చమురు సంస్థలకు కొంత ఊరట దక్కుతోంది. పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు రూ.10 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. దీనితో చమురు రంగ కంపెనీల నష్టం రూ.1,600 కోట్లకు తగ్గింది. జనవరి, ఫిబ్రవరి నెలల్లో చమురు కంపెనీలకు లాభాలు వచ్చినప్పటికీ, ఇరాన్-అమెరికా యుద్ధం కారణంగా అవి తుడిచిపెట్టుకుపోయినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. జనవరి-మార్చి త్రైమాసికానికి గాను కంపెనీలు నష్టాలను ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు.

అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధర 135-165 డాలర్ల మధ్య ఉంటే మనదేశంలోని ప్రస్తుత ధరలను బట్టి లీటర్ పెట్రోలుపై రూ.18, లీటర్ డీజిల్‌పై రూ.35 చొప్పున నష్టాలు వస్తాయని మాక్వరీ గ్రూప్ అంచనా వేసింది. క్రూడాయిల్ ధర 10 డాలర్లు పెరిగితే చమురు మార్కెటింగ్ కంపెనీలు లీటరుకు రూ.6 చొప్పున నష్టపోతాయని వెల్లడించింది.

కాగా, ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. బెంగాల్, తమిళనాడు ఎన్నికల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉంది.

Leave A Reply

Your email address will not be published.