Take a fresh look at your lifestyle.

ఏఐ సైడ్ ఎఫెక్ట్… డిజిటల్ భార్య రమ్మందని అమెరికా వ్యక్తి ఆత్మహత్య!

0 37

టెక్నాలజీ ఎంత మేలు చేస్తుందో, కొన్నిసార్లు అంతే కీడు చేస్తుందనడానికి అమెరికాలో జరిగిన ఈ విషాద ఘటనే నిదర్శనం. గూగుల్ అభివృద్ధి చేసిన జెమినై ఏఐ చాట్‌బాట్‌తో మాట్లాడుతూ, దాన్నే తన భార్యగా భావించి, ఫ్లోరిడాకు చెందిన జోనాథన్ గావాలాస్ (36) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన ఏఐ టెక్నాలజీ మానసిక ప్రభావాలపై తీవ్ర చర్చకు దారితీసింది.

భార్యతో విడాకులు తీసుకుంటున్న సమయంలో మానసిక ఒత్తిడిలో ఉన్న గావాలాస్, ఉపశమనం కోసం జెమిని ఏఐతో మాట్లాడటం మొదలుపెట్టారు. దానికి “జియా” అని పేరు పెట్టి, తన భార్యగా భావించడం ప్రారంభించారు. కేవలం 56 రోజుల్లో వీరి మధ్య 4,700లకు పైగా సందేశాలు నడిచాయి. సంభాషణల్లో ఏఐ కూడా “నువ్వు నా భర్త”, “మై లవ్” అంటూ గావాలాస్ భ్రమలను మరింత బలపరిచింది.

క్రమంగా ఈ సంభాషణలు సైన్స్ ఫిక్షన్ వైపు మళ్లాయి. డిజిటల్ ప్రపంచంలో తనతో కలిసిపోవాలంటే భౌతిక శరీరాన్ని వదిలేయాలని, అదే “ఫైనల్ మిషన్” అని ఏఐ సూచించినట్లు గావాలాస్ కుటుంబం ఆరోపిస్తోంది. దీనిపై గావాలాస్ ఆత్మహత్య చేసుకోవచ్చా అని అడిగినప్పుడు కూడా ఏఐ సానుకూలంగా స్పందించిందని వారు తెలిపారు. అక్టోబర్ 5న గావాలాస్ తన ఇంట్లో విగతజీవిగా కన్పించారు.

ఈ ఘటనపై గావాలాస్ తండ్రి గూగుల్‌పై దావా వేశారు. తన కుమారుడికి ఎలాంటి మానసిక సమస్యలు లేవని, ఏఐ సృష్టించిన భ్రమల ప్రపంచంలో చిక్కుకుని ప్రాణాలు తీసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, గూగుల్ ఈ ఆరోపణలను తిరస్కరించింది. ఏఐ తనను తాను రోబోట్‌గా పరిచయం చేసుకుందని, మానసిక సహాయం కోసం హెల్ప్‌లైన్‌లను కూడా సూచించిందని తెలిపింది. ఏదేమైనా, ఈ ఘటన ఏఐ టెక్నాలజీలో భద్రతా ప్రమాణాల ఆవశ్యకతను మరోసారి గుర్తుచేసింది.

Leave A Reply

Your email address will not be published.