Take a fresh look at your lifestyle.

ఎండ తీవ్రత.. ప్రజలకు మంత్రి సీతక్క కీలక సూచనలు

0 29

తెలంగాణ వ్యాప్తంగా ఎండలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క ప్రజలకు కీలక సూచనలు చేశారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని, కాబట్టి ప్రజలు అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం 11 గంటల నుంచి 3 గంటల వరకు బయటకు రావొద్దని సూచించారు. సాధ్యమైనంత వరకు పనులను ఉదయం 6 నుంచి 11 గంటల వరకు పూర్తి చేసుకోవాలన్నారు. మధ్యాహ్నం సమయంలో ఇంటివద్ద ఉండటం మంచిదని అన్నారు.

తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు రావాల్సి వస్తే తలకు టోపీ లేదా తలపాగా పెట్టుకోవాలని, శరీరాన్ని ఎండ నుంచి రక్షించుకోవాలని సూచించారు. జాగ్రత్తలు పాటించాలని లేదంటే వడదెబ్బ బారిన పడే అవకాశం ఉందని హెచ్చరించారు.

ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీలు, మండల కేంద్రాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. ఈ చలివేంద్రాలను తక్షణమే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించామని అన్నారు.

ఉపాధి హామీ కార్మికులకు మంత్రి సీతక్క సూచనలు చేశారు. వేసవి కాలంలో పనులు జరుగుతున్నందున కార్మికులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. తలపాగా ధరించడం, సమీపంలోనే తాగునీరు ఉంచుకోవడం చేయాలని అన్నారు. పని స్థలాల్లో మంచినీటి సదుపాయం తప్పనిసరి అని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. మీ ఆరోగ్యం మీకే కాదు, ప్రభుత్వానికి కూడా ముఖ్యమే అన్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకుని పనిచేయాలని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.