Take a fresh look at your lifestyle.

ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఢీకొన్న రెండు విమానాలు

0 261

దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం సాయంత్రం పెను ప్రమాదం తృటిలో తప్పింది. ట్యాక్సీ వేపై ఆకాశ ఎయిర్, స్పైస్‌జెట్‌కు చెందిన రెండు విమానాలు ఒకదానికొకటి స్వల్పంగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా బయటపడటంతో అధికారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

విమానాశ్రయ వర్గాల సమాచారం ప్రకారం, స్పైస్‌జెట్‌కు చెందిన బోయింగ్ బీ737-700 విమానం ట్యాక్సీయింగ్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో హైదరాబాద్‌కు బయలుదేరేందుకు సిద్ధంగా ఉన్న ఆకాశ ఎయిర్ విమానం క్యూపీ 1406 నిలిపి ఉంది. వేగంగా వస్తున్న స్పైస్‌జెట్ విమానం కుడి రెక్క (రైట్ వింగ్), నిలిపి ఉన్న ఆకాశ విమానం తోక భాగంలోని స్టెబిలైజర్‌ను తాకింది. దీంతో రెండు విమానాల భాగాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి.

ఈ ఘటనపై ఆకాశ ఎయిర్ వెంటనే స్పందించింది. తమ విమానం ఆగి ఉన్నప్పుడు మరో విమానం వచ్చి ఢీకొట్టినట్లు ప్రాథమికంగా తెలిసిందని సంస్థ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. “ప్రయాణికులు, సిబ్బంది అందరినీ సురక్షితంగా విమానం నుంచి దించాం. హైదరాబాద్ వెళ్లాల్సిన ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం” అని ఆయన వివరించారు.

ఈ ఘటన కారణంగా దిల్లీ విమానాశ్రయంలో విమాన రాకపోకలకు పెద్దగా అంతరాయం కలగలేదు. అయితే, దెబ్బతిన్న రెండు విమానాలను అధికారులు పరిశీలన కోసం బేకు తరలించారు. ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విచారణ జరిపే అవకాశం ఉంది.

Leave A Reply

Your email address will not be published.