Take a fresh look at your lifestyle.

డీలిమిటేషన్ తో నష్టం ఉండదు… మీకు బ్లాంక్ చెక్ ఇస్తున్నా: లోక్ సభలో ప్రధాని మోదీ

0 225

మహిళా రిజర్వేషన్ల అమలుకు ముందు చేపట్టే నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) విషయంలో ఎలాంటి వివక్షకు, అన్యాయానికి తావుండదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టమైన హామీ ఇచ్చారు. ఈ విషయంలో తాను “గ్యారెంటీ”, “ప్రామిస్” వంటి పదాలను ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్నానని, ఉత్తర, దక్షిణ రాష్ట్రాలనే తేడా లేకుండా ఈ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని ఆయన భరోసా ఇచ్చారు.

గురువారం లోక్‌సభలో ‘రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు, 2026’పై జరిగిన చర్చలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళా రిజర్వేషన్ల అంశాన్ని రాజకీయాలకు అతీతంగా చూడాలని పిలుపునిచ్చారు. “ఈ బిల్లు ఘనతను మీరే తీసుకోండి. మీకు నచ్చిన వారి ఫొటోలతో నేను ప్రకటనలు ఇవ్వడానికైనా సిద్ధం. ఈ విషయంలో మీకు ‘బ్లాంక్ చెక్’ ఇస్తున్నా” అని విపక్షాలను ఉద్దేశించి అన్నారు.

ఈ బిల్లు దేశ రాజకీయాల దిశ, దశను మార్చే శక్తిమంతమైనదని ప్రధాని అభిప్రాయపడ్డారు. దేశ జనాభాలో సగభాగమైన మహిళలు విధాన నిర్ణయాల్లో పాలుపంచుకోవడం ద్వారా ‘వికసిత్ భారత్ @2047’ లక్ష్యాన్ని చేరుకోవడం సులభమవుతుందని పేర్కొన్నారు. 2023లోనే ‘నారీ శక్తి వందన్ అధినియం’ను ఏకాభిప్రాయంతో ఆమోదించామని గుర్తుచేశారు. “2029 నాటికి మహిళా కోటాను అమలు చేయడంలో విఫలమైతే, మన చిత్తశుద్ధిని మహిళలు నమ్మరు. దశాబ్దాలుగా వారికి నిరాకరించిన హక్కులను అందించే గొప్ప అవకాశం ఇప్పుడు మనకు లభించింది” అని మోదీ అన్నారు.

గ్రామ పంచాయతీల నుంచి పట్టణ స్థానిక సంస్థల వరకు ఇప్పటికే వేల సంఖ్యలో మహిళలు నాయకత్వ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని, ఇప్పుడు వారిని జాతీయ స్థాయిలో విధాన నిర్ణయాల్లో భాగస్వాములను చేయాల్సిన సమయం వచ్చిందని ప్రధాని తెలిపారు. అంతకుముందు, ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టడాన్ని లోక్‌సభ ఆమోదించింది. విపక్షాలు రికార్డెడ్ ఓటింగ్ కోసం పట్టుబట్టడంతో, డివిజన్ ప్రక్రియ ద్వారా దీనికి ఆమోదం లభించింది.

Leave A Reply

Your email address will not be published.